జీవితంలో ఎవరు లేకపోయినా తట్టుకోగలం కానీ అమ్మ లేకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుసు. ముఖ్యంగా తల్లీకొడుకుల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. సామాన్య ప్రజలకే కాదు సినీ ప్రముఖులకు కూడా అమ్మంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. కానీ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మాత్రం చిన్న వయసులోనే తన తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, మోనా షౌరీల కుమారుడు అర్జున్. బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాక మోనా బెంగతో అనారోగ్యానికి గురయ్యారు. అర్జున్ తన సినీ కెరీర్‌ను ప్రారంభించినప్పుడే ఆమె అనంతలోకాల్లో కలిసిపోయారు. అప్పటి నుంచి తన తల్లిని గుర్తుచేసుకుంటూ అర్జున్ ఏడవని రోజంటూ లేదు. ఈ రోజు అర్జున్ తనకు పన్నెండు ఏళ్లు ఉన్నప్పుడు తన తల్లికి రాసిన ఓ ఉత్తరాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
‘నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు మా అమ్మ కోసం నేను రాసిన ఉత్తరం ఇది. నాకు చిన్నతనంలో మా అమ్మ నాకు పంచిన ప్రేమను వివరిస్తూ రాశాను. ఆమె ప్రేమను నేను చాలా మిస్సవుతున్నాను. ఉదయం ఈ ఉత్తరాన్ని చూడనిదే నాకు ఏమీ తోచదు. నాకు మా అమ్మ ప్రేమ ఇకపై ఉండదు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడం తప్ప నేనేమీ చేయలేను. తలుచుకున్నప్పుడల్లా ఎంతో కుమిలిపోతుంటాను. మరోసారి మా అమ్మ నన్ను బేటా అని పిలిస్తే బాగుండు అనిపిస్తుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు నన్ను నేను కోల్పోయాను. ఉదయం లేవగానే పక్కన అమ్మ ఉండదు అని నాకు నేను సర్దిచెప్పుకుంటూ ఉంటాను. కానీ మా అమ్మ లేని లోటు ఎప్పటికీ తీరదు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అమ్మా.. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావని ఆశిస్తు్న్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నారు అర్జున్. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖుల హృదయాలు బరువెక్కాయి. ధైర్యంగా ఉండు అర్జున్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తన తల్లి చావుకు తన తండ్రి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడమేనని భావించిన అర్జున్.. చాలా కాలం పాటు తన తండ్రిని దూరం పెట్టాడు. శ్రీదేవి కుటుంబాన్ని కూడా దగ్గరకు రానివ్వలేదు. కానీ ఎప్పుడైతే శ్రీదేవి చనిపోయి తన ఇద్దరు కూతుళ్లను అనాథలను చేసిందో అప్పుడే అర్జున్ వారిని తన చెల్లెళ్లుగా స్వీకరించాడు. తల్లి లేని బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వ్యక్తి కాబట్టి తన కంటే చిన్నవారైన శ్రీదేవి కూతుళ్లను సొంత చెల్లెళ్లకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు.