Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల పర్వం నడుస్తోంది. అందులోనూ క్రీడా నేపథ్యమున్న బయోపిక్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భాగ్ మిల్కీ భాగ్ సూపర్ హిట్ గా నిలవడంతో… ఆ తర్వాత నుంచి బాలీవుడ్ వరుసగా క్రీడాకారులు, క్రీడాకారిణుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తూనే ఉంది. బాగ్ మిల్కీ బాగ్ తర్వాత ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేరీకోమ్ మూవీ సంచలన విజయం సాధించింది. ఆ కోవలోనే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పై గత ఏడాది వచ్చిన ధోనీ… ది అన్ టోల్డ్ స్టోరీ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషించారు. ధోనీ సినిమా తర్వాత… మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా వచ్చిన సచిన్ః ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
భారత క్రికెట్ పై చెరగని ముద్రవేసిన ధోనీ, సచిన్ తర్వాత ఇప్పుడు కపిల్ బయోపిక్ వంతువచ్చింది. భారత్ కు తొలి వరల్డ్ కప్ క్రికెట్ కప్ సాధించిపెట్టి… దేశంలో క్రికెట్ దశను, దిశను మార్చివేసిన మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ జీవితగాథను వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు కబీర్ ఖాన్ భావిస్తున్నారు. బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ కపిల్ దేవ్ పాత్రను పోషించనున్నాడు. ఈ పాత్రకోసం గతంలో కబీర్ ఖాన్ … హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ తో సంప్రదింపులు జరిపినా…. చివరకు అర్జున్ కపూర్ కు అవకాశం దక్కింది. పూర్తివివరాలను చిత్ర బృందం ఈ నెల 27న వెల్లడించనుంది. ఇవే కాదు… ఇతర రంగాలకు చెందిన క్రీడాకారిణల జీవితగాధలు కూడా త్వరలోనే వెండితెరపై చూసే అవకాశముంది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్ గురించి చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నా…. దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అంతకంటే ముందే..బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్, పి.వి. సింధు జీవితాలపై బయోపిక్ లు వస్తున్నాయి.
సైనా నెహ్వాల్ పాత్రను శ్రద్ధకపూర్ పోషిస్తుండగా… పి.వి. సింధు పాత్రలో ఎవరు కనిపిస్తారో ఇంకా వెల్లడి కాలేదు. ఇటీవలి కాలంలో బ్యాడ్మింటన్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సింధు జీవిత కథను తెరకెక్కించేందుకు ప్రముఖ నటుడు సోనూసూద్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి మంచి వసూళ్లను రాబడుతుండటంతో పాటు.. ఎందరికో స్ఫూర్తినిస్తున్న .. బయోపిక్ ల పర్వాన్ని బాలీవుడ్ మరికొన్నాళ్లు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.