అర్జున్ రెడ్డి మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

Arjun Reddy movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  విజయ్ దేవరకొండ , షాలిని పాండే 
నిర్మాత :  ప్రణయ్ రెడ్డి వంగ 
దర్శకత్వం :  సందీప్ రెడ్డి వంగ 
మ్యూజిక్ డైరెక్టర్ :  రధన్ 
ఎడిటర్ :  శశాంక్ 
సినిమాటోగ్రఫీ : రాజు తోట 

చిన్న సినిమాలు తీయడం మాటెలా దాన్ని విడుదల చేయడం ఓ మహా యజ్ఞం అనుకునే ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. సరైన కంటెంట్, పబ్లిసిటీ ప్లానింగ్ ఉంటే చిన్న సినిమా చుట్టూ కూడా బయ్యర్లు తిరుగుతారని నిరూపించిన సినిమా అర్జున్ రెడ్డి.ఈ సినిమా పోస్టర్స్ లిప్ టు లిప్ కిస్ తో డిజైన్ చేయడంతో చెలరేగిన వివాదం ఈ సినిమా మీద ఇంకాస్త అంచనాలు పెంచాయి. ఆ అంచనాలకి తగ్గట్టు అర్జున్ రెడ్డి వున్నాడో, లేడో చూద్దామా.

కథ…

హౌస్ సర్జన్ చేస్తున్న అర్జున్ రెడ్డి తన కన్నా జూనియర్ అయిన ప్రీతీ శెట్టి ని చూసీచూడగానే ప్రేమలో పడతాడు. ఫుడ్ బాల్ ఆటలో గొడవల కారణంగా ఆ కాలేజీ ని వదిలి రావాల్సి వచ్చినా ఆమె కోసం, ఆమె ప్రేమ కోసం అక్కడే ఉండిపోతాడు. అతను అనుకున్నట్టే ప్రీతి అర్జున్ రెడ్డి ప్రేమలో పడుతుంది. కాలం గడిచేకొద్దీ వాళ్ళు ఒకరిని వదిలి ఇంకొకరు వుండలేకపోతారు. పెళ్ళైన దంపతుల్లాగే సహజీవనం చేస్తారు. అయితే జీవితం వారు అనుకున్నంత సాఫీగా సాగదు. ఇద్దరికీ కుటుంబ సమస్యలు మొదలు అవుతాయి. ప్రీతి శెట్టి కి ఆమె కులానికి చెందిన వేరొకరితో పెళ్లి అవుతుంది.దీంతో అర్జున్ రెడ్డి తీవ్ర నిరాశ నిస్పృహల్లో పడతాడు. దాన్నుంచి అర్జున్ రెడ్డి ఎలా బయటపడతాడు ? ప్రీతి పెళ్లి తర్వాత అర్జున్ రెడ్డి జీవితంలో వచ్చిన అనూహ్య మార్పులు ఏమిటి ? చివరకు జరిగేది ఏమిటి అన్నది అర్జున్ రెడ్డి సినిమా.

నటీనటుల ప్రతిభ…

విజయ్ దేవరకొండ లో అర్జున్ రెడ్డి మాత్రమే కనిపించాడు. అతని లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ అర్జున్ పాత్రకి తగినట్టు మలుచుకోవడంలో విజయ్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ గా చేసిన షాలిని పాండే కూడా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ గా చేసిన రాహుల్ రామకృష్ణ, హీరోయిన్ సోదరుడిగా చేసిన కమల్ కామరాజ్ తన పాత్రల్లో మెరిశారు.

విశ్లేషణ…

కథ పరంగా చూసుకుంటే అర్జున్ రెడ్డి చాలా సింపుల్ కథ. ఈ తరహాలో ఇంతకుముందు చాలా కధలు వచ్చాయి. అయితే వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఆ లోపం ఎక్కడా కనిపించకుండా చూడడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తెలుగు తెర మీద వచ్చిన ప్రేమ కథ ని ఇంత సరికొత్తగా, ఇంత ధైర్యంగా తీసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి తన ఆలోచనలతో కుర్రకారుని ఊపేసాడు. ఇక ఓ సెక్షన్ అఫ్ పీపుల్ సందీప్ ఆలోచనల్ని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, లేదా అంతర్మథనంలో పడవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ లో వడివడిగా నడిచిన కధనం, సెకండ్ హాఫ్ లో కాస్త స్పీడ్ తగ్గింది.మొత్తానికి ట్రైలర్, పబ్లిసిటీ తో వచ్చిన హైప్ చూసి సినిమాకి వచ్చిన ఏ ఒక్కరూ సినిమాకి వస్తే సంతృప్తిగా వెళతారు తప్ప నిరుత్సాహం చెందే అవకాశం లేదు.టెక్నికల్ టీం … డైలాగ్స్ ఈ సినిమాకి అదనపు బలం. రతన్ సంగీతం, రాజు తోట ఫోటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ …
దర్శకత్వం
విజయ్ దేవరకొండ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్రీన్ ప్లే .

మైనస్ పాయింట్స్ …
సెకండ్ హాఫ్ లో లాగ్.

తెలుగు బులెట్ పంచ్ లైన్ …“అర్జున్ రెడ్డి” నేటి తరం కుర్రోడు.
తెలుగు బులెట్ రేటింగ్ …3 . 25 / 5 .