Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ లోని కరణ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. నిన్న ఉదయం నుంచి కొనసాగిన ఎన్ కౌంటర్ ఉగ్రవాదుల మృతితో ముగిసింది. సోమవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు సీఆర్ పీఎఫ్ శిబిరం వద్ద ఏకే 47 తుపాకులు, భారీ ఆయుధాలతో కూడిన బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. అక్కడే గస్తీ కాస్తున్న ఓ జవాన్ వీరిని గమనించడంతో ఆ ఇద్దరూ తప్పించుకుని పారిపోయి ఓ భవనంలో దాక్కున్నారు. అప్పటినుంచి వారిని బయటకు రప్పించేందుకు సైన్యం, పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. భవనాన్ని చుట్టుముట్టి ఎదురుకాల్పులు జరిపారు. రాత్రంతా కాల్పులు కొనసాగాయి. భవనంలో దాక్కున్న ఉగ్రవాదుల్లో ఒకరు మరో భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో సైన్యం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. మరో ముష్కరుడు భవనంలో ఉండగా సైన్యం అతన్ని చుట్టుముట్టి హతమార్చింది. భవనంలోకి వెళ్లడానికి ముందు ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడిని సైన్యం సమర్థంగా అడ్డుకుంది. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయి.