జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటన ఆందోళన రేపింది. పంజాబ్, జమ్మూ సరిహద్దుకు సమీపంలో కథువాలోని రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు సంఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆర్మీ బృందం రెస్క్యూ టీమ్ ప్రమాద స్థలానికి చేరుకుని నిసహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. అయితే అయిదుగురితో ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఆర్మీ హెలికాప్టర్ డ్యామ్‌లో కూలిపోయిన సమాచారం అందిందని రక్షణ బృందాలను ఘటనా స్థలానికి తరలించామని పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సురేంద్ర లంబా తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఆనకట్ట పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది.