తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. ప్రమాద తీవ్రతకు మంటలు ఎగిసిపడ్డాయి.
వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్‌తో సహా ఆయన భార్య మధులిక, సీడీఎస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్‌ను సహాయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 13 మంది దుర్మరణం పాలైనట్టు భారత వాయుసేన తర్వాత ధ్రువీకరించింది. మృతుల్లో సీడీఎస్ భార్య మధులిక కూడా ఉన్నారు.