క‌ర్వాచౌత్ రోజే సైనికుడి మ‌ర‌ణం…

Army Jawan phone call his wife to break karva chauth fast before dead

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉత్త‌రాదిలో మ‌హిళలు భ‌ర్త నిండు నూరేళ్లు ఉండాల‌ని కోరుకుంటూ క‌ర్వాచౌత్ ప‌ర్వ‌దినం రోజు ఉప‌వాస దీక్ష చేస్తారు. అలానే ఆర్మీలో ప‌నిచేస్తున్న ఓ భ‌ర్త కోసం ఆయ‌న భార్య ఉప‌వాస దీక్ష ఆచ‌రించింది. కానీ ఆ దీక్ష ఆమెకు ఫ‌లితాన్నివ్వ‌లేదు. క‌ర్వాచౌత్ రోజే ఆమె భ‌ర్త ఉగ్ర‌మూక‌ల కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. కొన ఊపిరితో ఉండి భార్య‌కు ఫోన్ చేశాడు. త‌న కోసం భార్య ఉప‌వాసం చేస్తోంద‌ని తెలిసి నువ్విక భోజ‌నం చేసెయ్, నేను డ్యూటీకి వెళ్తున్నాను. ఉద‌యం మాట్లాడ‌తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తెల్లారి ఉద‌యానికి ఆమెకు భ‌ర్త మ‌ర‌ణ‌వార్త తెలిసింది. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఉత్త‌ర కాశ్మీర్ లో చోటుచేసుకుంది.

కంగ్ర ప్రాంతానికి చెందిన సుబేదార్ కుమార్ బ‌డ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా ప‌నిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఉగ్ర‌వాదుల కాల్పుల్లో కుమార్ తీవ్ర‌గాయాల‌పాల‌య్యాడు. ఆఖ‌రిసారిగా భార్య దేవితో మాట్లాడాల‌ని ఫోన్ చేశాడు. ఆస‌మ‌యంలో భార్య క‌ర్వాచౌత్ ఉప‌వాసం చేస్తోంద‌ని తెలిసి ఉప‌వాసం విడిచి భోజ‌నం చేయాల‌ని కోరాడు. డ్యూటీకి వెళ్తున్నాన‌ని, త‌ర్వాతి రోజు ఉద‌యం ఫోన్ చేస్తాన‌ని చెప్పాడు. భ‌ర్త చెప్పిన‌ట్టుగ‌టానే ఆమె దీక్ష ముగించి భోజ‌నం చేసింది. తెల్ల‌వారి ఉద‌యం నిద్ర‌లేచే స‌రికి కుమార్ కాల్పుల్లో చ‌నిపోయిన‌ట్టు దేవికి ఫోన్ వ‌చ్చింది. భ‌ర్త మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక దేవి క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది. దేవి క‌ర్వాచౌత్ ఉప‌వాసం చేయ‌డం, కొన ఊపిరితో ఉండి కుమార్ ఆమెకు ఫోన్ చేయ‌డం, తెల్ల‌వారి లేచేస‌రికి కుమార్ మర‌ణ‌వార్త తెలియ‌డం… ఈ విషాదం పలువురితో కంట‌త‌డి పుట్టిస్తోంది. కుమార్ భౌతిక‌కాయానికి అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.