సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం….

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు దాడికి దిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు కంగన్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దీంతో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఉగ్రవాదులకు సైన్యానికి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని జమ్ముకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే.. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా జైషే-ఇ-మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. కాగా మృతులను కశ్మీరీ వాసులుగా గుర్తించినట్లు తెలిపారు.