రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు అక్రమమనీ, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలనీ, ముంబై పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని బెయిల్ పిటిషన్‌లో అర్నబ్ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపునకు పాల్పడుతోందని అర్నబ్ తరఫు లాయర్ హరీశ్ సాల్వే ఆరోపించారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు.. వాదనలు వినిపించాలని ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, అన్వయ్ నాయక్ భార్య అక్షతను కోరింది. శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది.
అర్నబ్‌ను అరెస్టు చేయడం ప్రాథమికంగా చట్ట విరుద్ధమని మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టుచేశారు. అర్నబ్‌తోపాటు అరెస్టు చేసిన ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను పోలీసులు రాయగఢ్ జిల్లా అలీబాగ్ కోర్టులో బుధవారం రాత్రి హాజరు పరిచారు.
ఈ కేసులో అర్నబ్‌ను 18వరకు అలీబాగ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ సునయన.. మృతులకు, నిందితులకు మధ్య ఉన్న సంబంధాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు రుజువులు లేవన్నారు. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు అలీబాగ్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్‌లో కోవిడ్ సెంటర్‌లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు.