అమ్మాయి తనే… పిన్ని తనే – మాట్రిమోనీ సైట్స్ తో జర భద్రం…!

Arrested On Matrimony Fraud Case

చదువుకున్నోడు కంటే చాకలోడు మేలు అనే సామెత విని చదువుకున్నోళ్లం మనం ఏదో ఫీల్ అవుతాం కానీ…టెక్నాలజీతో ప్రపంచం అంతా చేతిలో ఇమిడాక ఫేస్బుక్ ప్రేమలతోనో, మాట్రిమోనీ సైట్స్లలో నకిలీ ప్రొఫైల్స్ తోనో మోసపోయేవారందరూ చదువుకున్నోళ్ళే అని తెలిసిన నిజమే మళ్ళీ చదువుతుంటే తెగ ఇదైపోతుంటాము కదా.ఇక విషయంలోకి వస్తే, మేడ్చల్ జిల్లా యాప్రాల్ లో నివాసముండే రిటైర్డ్ ఆర్మీ కల్నల్ భూపిందర్ సింగ్ తన కొడుకు దిల్ ప్రీత్ సింగ్ వివాహం కోసం భారత్ మాట్రిమోనీ కి సంబంధించిన డిఫెన్స్ మాట్రిమోనీ అనే సైట్ లో ప్రొఫైల్ నమోదు చేశారు. ఇదే సైట్ లో రిజిస్టర్ చేసుకున్న రిథిమా కల్సే అనే యువతి, తాను ముంబాయి లోని ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ అని, మీ ప్రొఫైల్ మాకు నచ్చిందని చెప్పి దిల్ ప్రీత్ సింగ్ తో మాట కలిపి, పెళ్లి ప్రస్తావన తెచ్చింది. రిథిమా కల్సే ప్రొఫైల్ పిక్ చూసి ఇష్టపడిన దిల్ ప్రీత్ సింగ్ తన నుండి వచ్చిన పెళ్లి ప్రస్తావన కి ఆమోదం తెలిపాడు. ఇక అప్పటినుండి వారి మధ్య మాటలు పెరిగాయి.

cyber

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు దిల్ ప్రీత్ సింగ్ కి కాల్ చేసిన రిథిమా తన బామ్మ కి ఆరోగ్యం బాగాలేదని, తనకి ఆసుపత్రిలో చికిత్స కోసం కొంత డబ్బు అవసరం అని, తనకి ఉన్నవి ఎన్నారై అకౌంట్స్ దృష్ట్యా లావాదేవీలకు అంతరాయం కలుగుతుందని చెప్పి, ఇప్పుడు మీరు కాస్త డబ్బు సర్దుబాటు చేస్తే, త్వరలోనే మీకు తిరిగి ఇస్తానని నమ్మబలికి, పూర్తి నమ్మకం కలిగించడం కోసం తన పిన్ని తో కూడా మాట్లాడించింది. దీనితో ఆమె మాటలు నిజమే అని నమ్మిన దిల్ ప్రీత్ సింగ్ కొన్ని దఫాలుగా 3.36 లక్షల రూపాయలని ఆమె చెప్పిన ఖాతాలో జమ చేశాడు. కొన్ని రోజుల నుండి ఆమెని కలవాలనుకుంటున్నాని దిల్ ప్రీత్ సింగ్ అడుగుతున్న ప్రతిసారి ఆమె ఏదో ఒక సాకు అడ్డుచెప్పి, తిరస్కరిస్తుండడంతో అనుమానం వచ్చిన దిల్ ప్రీత్ సింగ్ మరియు అతని తండ్రి ఆమె చెప్పిన ముంబై అడ్రస్ కి వెళ్లి వాకబు చేయగా ఆమె అక్కడ లేకపోవడంతో, తాము మోసపోయినట్టు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీనితో ఈ కేస్ ని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె. వి. విజయ్ కుమార్ దర్యాప్తు చేసి ఆమె ఆచూకీ కనుక్కొని ఆమె అసలు గుట్టుని రట్టు చేశారు.

bharat-matrymony
పోలీసుల సమాచారం ప్రకారం, రిథిమా కల్సే అసలు పేరు రీమా సింధు అని, ఆమె అమ్మాయి కాదని, 42 వయస్సు దాటిన మధ్యవయస్సు మహిళ అని, ఈమెకి భర్త సిద్ధాంత్ సింగ్ సింధు ఉన్నాడని, ఈమె డాక్టర్ కూడా కాదని, దిల్ ప్రీత్ సింగ్ తో పిన్నిగా గొంతు మార్చి ఈమెనే మాట్లాడిందని తెలిసింది. ప్రస్తుతం ఆమెని ముంబై లోని కోర్ట్ లో హాజరు పరిచి, ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే, మోసం చేయడం ఆమె ప్రవృత్తి అయినా, సరైన సమాచారం తెలుసుకోకుండా, మాట్రిమోనీ ప్రొఫైల్ పిక్ చూసి, నచ్చి, అడిగినంత సొమ్ముని ఆమె ఖాతాలో జమ చేసిన దిల్ ప్రీత్ సింగ్ అవివేకం ఆశ్చర్యం కలిగించక మానదు. అందులోనూ అతను రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కొడుకు కావడం, ప్రస్తుత సొసైటీ లో నిత్యం జరిగే ఆన్లైన్ మోసాలు తెలిసి, మోసపోవడం పూర్తి అవివేకమైన చర్య అనడంలో సందేహం అయితే ఏమి లేదు. మాట్రిమోనీ సైట్లతో ఇకనైనా జరభధ్రం.