నేవీపై వలపు వల విసిరే గూఢచారి అరెస్ట్

భారత నేవీ అధికారులను ప్రేమ బుట్టులో పడేసి కీలక సమాచారాన్ని రాబట్టే పాక్ గూఢచారులు దొరికిపోయారు. పాక్‌ గూఢచారుల పరిధిలో పనిచేసే కొందరు అమ్మాయిలు సోషల్‌ మీడియా ద్వారా ముందుగా భాతర నేవీ అధికారులు, ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొనేవారు. ఆ తర్వాత భారత్‌లోని పాక్‌ ఏజెంట్లు హనీట్రాప్‌ వివరాలు బయటపెడుతామని బెదిరించి నేవీ అధికారుల నుంచి భారత యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలు, వాటి సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషన్లతో పాటు అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారులకు అందించేవారు. అయితే ఈ సమాచారం అందించినందుకు కొంత డబ్బు కూడా రహస్యంగా వారి ఖాతాల్లో జమ చేస్తుండేవారు.

అయితే భారత నౌకాదళంలో కలకలం సృష్టించిన హనీట్రాప్‌ కుట్రకేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ముంబైకి కిందిన మొహమ్మద్‌ హరూన్‌ హాజీ అబ్దుల్‌ రహమాన్‌ లాక్ డౌన్ కాలంలో అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు అధికారులు. కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఎన్ఐఏ అతని ఇంటినుంచి గూఢచర్యం కోసం వాడే పలు సాంకేతిక పరికరాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నౌకాదళం అధికారులకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా అమ్మాయిలను ఎరవేసి నేవీకి చెందిన కీలక సమాచారాన్ని రాబట్టి పాకిస్థాన్‌కు చేరవేయటంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా విశాఖపట్టణం నౌకాదళ కేంద్రంగా జరిగిన ఈ గూఢచర్యం 2019 డిసెంబర్‌ 20న బయటపడింది. దీంతో ఈ కుట్ర లోతులను తవ్వితీసేందుకు ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ పేరుతో ఎన్‌ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. గతేడాది డిసెంబర్‌ 29న విజయవాడ పోలీస్‌స్టేషన్ లో ఐపీసీ సెక్షన్‌ 120బీ, 121ఏ, యూఏ(పీ) చట్టం సెక్షన్‌ 17,18 అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్‌ 3 కింద కేసు నమోదుచేసి 11మంది నేవీ అధికారులతో పాటు 14 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. వారిలో పాకిస్థాన్‌లో జన్మించిన భారత జాతీయుడు షియాస్తా కైసర్‌ కూడా ఉన్నాడు.

అయితే… తాజాగా ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మొహమ్మద్‌ హరూన్‌ అంతర్జాతీయ వ్యాపారం ముసుగలో భారత నేవీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసేవాడు. గతంలో అతడు చాలాసార్లు పాకిస్థాన్‌లోకి కరాచీ వెళ్లి పాక్‌ గూఢచారులు అక్బర్‌ అలియాస్‌ అలీ, రిజ్వాన్‌ను కలిసేవాడని తెలుస్తోంది. వారి ఆదేశాలతో ఈ కుట్రలో భాగస్వాములైన నేవీ అధికారుల బ్యాంకు ఖాతాల్లో తరచూ డబ్బు జమ చేస్తుండేవాడని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తున్నారు.

అంతేకాకుండా పాక్‌ గూఢచారులు భారత నేవీ రహస్యాలు తెలుసుకొనేందుకు అత్యంత కట్టుదిట్టంగా ప్రణాళిక రూపొందించారని విచారణలో బయటపడింది. భారత్‌లో అనేక చోట్ల ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఒకరికి తెలియకుండా మరొకరితో గూఢచర్యం నిర్వహించారు. పాక్‌ గూఢచారుల పరిధిలో పనిచేసే కొందరు అమ్మాయిలు సోషల్‌ మీడియా ద్వారా ముందుగా భాతర నేవీ అధికారులు, ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొనేవారు. ఆ తర్వాత భారత్‌లోని పాక్‌ ఏజెంట్లు హనీ ట్రాప్‌ వివరాలు బయట పెడుతామని బెదిరించి నేవీ అధికారుల నుంచి భారత యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలు, వాటి సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషన్లతో పాటు అత్యంత సున్నితమైన కీలకమైన సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారులకు చేరవేసేవారు. మొత్తానికి చాలా కాలానికి అందులోని కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మంచి పరిణామంగా చెప్పవచ్చు.