భారత్ కు ట్రంప్ సాయం.. కలిసి పని చేద్దాం..

భారత్ కు అమెరికా దగ్గరవుతుందా అంటే అదేం కాదు.. కానీ చైనాను ఇరుకునపెట్టేందుకు ట్రంప్ కవ్వింపులే అవి అని చెప్పక తప్పదు. అదేమంటే. కరోనా వైరస్ విషయంలో చైనా తీరును అమెరికా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. చైనాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే తాజాగా భారత్‌కు వెంటిలేటర్లు అందజేయనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని నొక్కిచెప్పిన కాసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషం. అలాగే.. భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా అదిస్తామని.. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్యానించారు కూడా.

అదేవిధంగా భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 85వేలకు చేరింది. దీంతో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనాను అధిగమించింది. తమ స్నేహితులైన భారతీయులకు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని చెప్పడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతేకానీ.. ఎన్ని వెంటిలేటర్లు ఇస్తామన్న విషయాన్ని చెప్పలేదు. తాము భారతదేశానికి చాలా వెంటిలేటర్లను పంపుతున్నాం… తాను భారత ప్రధాని మోదీతో మాట్లాడాను.. ప్రస్తుతం కొద్ది సంఖ్యలోనే సరఫరా చేస్తున్నాం. వెంటిలేటర్ల సరఫరాలో తమకు ఎలాంటి కొరత లేదని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు. కరోనా విలయ తాండవానికి అల్లాడిపోయిన అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞ‌ప్తి మేరకు భారత్ 50 మిలియన్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పంపింది. అంతకు ముందు రోజే భారత్, ప్రధాని మోడీలపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

అంతేకాకుండా భారత్ పర్యటన ముగించుకుని అమెరికాలో అడుగు పెట్టిన మర్నాడే ట్రంప్.. మోడీని ఆకాశానికెత్తారు. ‘భారత్‌తో మనకున్న మంచి సంబంధాలను అధ్యక్షుడు ప్రశంసించారు. కొంతకాలంగా భారత్.. అమెరికాకు మంచి భాగస్వామిగా ఉంది. భారతదేశానికి వెంటిలేటర్లను పంపుతామన్న ట్రంప్ ప్రకటను స్వాగతిస్తున్నాం’ అని వైట్‌మౌస్ ప్రెస్ సెక్రెటరీ కయాలేగి మెక్‌నమీ స్పష్టం చేశారు. అలాగే.. భారత్‌తో పాటు మరి కొన్ని దేశాలకు వెంటిలేటర్లు పంపనున్నామని తెలిపారు. అంతటితో ఆగకుండా ట్రంప్ ఏమన్నారంటే.. కరోనాపై కలిసి పోరాటం చేసి అదృశ్య శత్రువును ఓడిస్తా! ఈ మహమ్మారి విజృంభణ కాలంలో తాము భారత్ వెంట నిలబడతామని.. మోడీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. భారతీయ-అమెరికన్లు గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు, కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో వారి పాత్ర అత్యంత కీలకమని కూడా వివరించారు. కాగా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేయడం విశేషం.