Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేరం రుజువయినా, కాకపోయినా….నిందితులుగా ఒక్కసారి జైలుకు వెళ్లారంటే..చాలు..వారిని సమాజం దోషులుగానే చూస్తుంది. ఏదో అపనమ్మకంగా, భయంగా, జాలిగొలిపించే విధంగా జైలుకు వెళ్లివచ్చిన వారితో వ్యవహరిస్తూ ఉంటారు సాధారణ జనాలు. జైలులో కలిగిన అనుభవాలు కన్నా..బయట ఎదురయ్యే పరిస్థితులు జైలు జీవితం గడిపిని వారిని ఎక్కువ బాధిస్తుంటాయి. అందుకే జైలుకు వెళ్లివచ్చిన వారు.. నలుగురిలోకి రావాలంటే భయపడుతుంటారు. తెలిసిన వారి దగ్గరే కాకుండా..పరిచయం లేనివారితో మాట్లాడాలన్నా ఇబ్బందిపడుతుంటారు. ఆరుషి హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ హైకోర్టు తీర్పుతో ఇటీవలే జైలు నుంచి విడుదలయిన తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు.
అక్టోబరు 16 న జైలునుంచి విడుదలయిన తల్వార్ దంపతులు తొలిసారి అన్ సాల్వ్ డ్ ఆరుషి మర్డర్ అనే ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ లో మాట్లాడారు. అన్నేళ్లు జైలులో ఉండి వచ్చాక సమాజంలో తిరగాలంటే భయంగా ఉందన్నారు రాజేశ్, నూపుర్ లు. బయట చాలా మందిని చూస్తున్నామని, వారి చూపులు తమపైనే ఉన్నాయని, ఈ సమయంలో ప్రపంచాన్ని, సమాజాన్ని తలెత్తి చూడాలంటే భయంగా ఉందని వారు చెప్పారు. తమను జైలునుంచి విడిపించినందుకు దేవుడికి రుణపడి ఉంటామని తెలిపారు. 2008లో ఆరుషి తన ఇంట్లోని బెడ్ రూంలో హత్యకు గురైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆరుషి మృతదేహం ఉన్న చోటుకి పోలీసుల కన్నా ముందుగా మీడియా ప్రతినిధులు వచ్చారు. సంఘటనా స్థలంలో వారు తిరగటంతో హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషి మృతదేహాన్ని మొదట చూసింది వారి ఇంట్లో పనిచేసే హేమరాజ్. అయితే ఆరుషి హత్య వెలుగుచూసిన దగ్గరనుంచి హేమరాజ్ కనిపించకుండా పోయాడు. దీంతో హేమరాజ్ ఈ హత్య చేసి ఉంటాడని అంతా భావించారు. అయితే మరుసటి రోజు ఆరుషి ఇంటి టెర్రస్ పై హేమరాజ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో వారికి ఆరుషి తల్లిదండ్రులపై అనుమానమొచ్చింది.
ఆరుషిని, హేమరాజ్ తో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన రాజేశ్ ఆవేశం ఆపుకోలేక కూతురిని హత్యచేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీన్ని పరువు హత్యగా భావించి…రాజేశ్ దంపతులపై కేసు నమోదుచేశారు. అయితే…వారే ఈ హత్యచేశారనడానికి పోలీసులకు సరైన సాక్ష్యాధారాలు లభించలేదు. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా విచారణను సీబీఐకి అప్పగించారు. సీబీఐకి చెందిన రెండు బృందాలు ఈ కేసు దర్యాప్తు సాగించాయి. రెండో బృందం జంట హత్యలను రాజేశ్ దంపతులే చేశారని కోర్టులో వాదించింది. నిందితులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. కానీ తమ ఇంట్లో హత్యలు ఎలా జరిగాయో చెప్పలేకపోయారు. దీంతో సందర్భానుసార సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు రాజేశ్ దంపతులే ఈ హత్యలు చేశారని 2013లో నిర్ధారించింది.
వారిద్దరికీ జీవితఖైదు విధించింది. సీబీఐ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా రాజేశ్, నూపూర్ లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్లపాటు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రాజేశ దంపతులను 2017 అక్టోబరు 12న నిర్దోషులుగా ప్రకటించింది. దాస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజేశ్ తల్వార్ దంపతులు అక్టబరు 16 న జైలునుంచి విడుదలయ్యారు. జైలులో తాము సంపాదించిన మొత్తాన్ని ఖైదీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిందిగా కోరుతూ విరాళంగా ఇచ్చారు. తరచుగా జైలుకు వచ్చి ఖైదీలకు దంతపరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులుగా విడుదల వడంతో ఈ హత్యలు ఎవరు చేశారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆరుషి హత్యపై సునీల్ మౌర్య అనే రచయిత ఏక్ ఆరుషి థీ పేరుతో ఓ పుస్తకం రాశారు. ఈ పస్తకం ఆధారంగా బాలీవుడ్ లో తల్వార్ అనే సినిమా తెరకెక్కింది. మరోవైపు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా…సుప్రీంకోర్టుకు వెళ్లాలని హేమరాజ్ భార్య నిర్ణయించుకుంది.