కాంగ్రెస్, బీజేపీ దొందూ…దొందే.. ఒక‌రిది మోసం…మ‌రొక‌రిది న‌మ్మ‌క‌ద్రోహం

Ashok Gajapathi Raju Comments On Congress and BJP
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర‌మంత్రులు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, సుజ‌నా చౌద‌రి త‌మ ప‌ద‌వులకు రాజీనామాలు స‌మ‌ర్పించారు. గురువారం సాయంత్రం ప‌దినిమిషాల పాటు ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన నేత‌లు ఆయ‌న‌కు రాజీనామా లేఖ‌లు అంద‌జేశారు. త‌మ రాజీనామాల‌కు కార‌ణ‌మైన ప‌రిస్థితుల‌ను ప్ర‌ధానికి వివ‌రించారు. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని స‌రిచేయ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైన కార‌ణంగానే మంత్రి ప‌ద‌వులకు రాజీనామా చేయాల్సివ‌చ్చింద‌ని తెలిపారు. అశోక్ గ‌జ‌ప‌తిరాజు పౌర‌విమాన‌యాన శాఖ‌మంత్రిగా, సుజ‌నా చౌద‌రి శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే 2014 మే 26న కేంద్ర‌మంత్రివ‌ర్గంలో చేరగా…సుజ‌నా చౌద‌రి మోడీ తొలి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో 2014 న‌వంబ‌ర్ 9న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌త్యే హోదాతో పాటు విభ‌జ‌న‌హామీల విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న అల‌స‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ కేంద్ర మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని టీడీపీ ఎప్ప‌టినుంచో భావిస్తోంది.

ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌ని..బుధ‌వారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించిన త‌రువాత‌…ఇక కేంద్ర‌ప్ర‌భుత్వంలో కొన‌సాగ‌రాద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, సుజ‌నా రాజీనామాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌ధానికి త‌మ స‌మ‌స్య ఏంటో తెలుస‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పుకుంటున్న‌ప్ప‌టికీ ఎన్డీఏలో కొన‌సాగుతామ‌ని తెలిపారు. మంత్రులుగా దేశానికి సేవ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పామ‌న్నారు.ఏపీకి త‌న‌వంతు సాయం చేస్తాన‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చార‌ని సుజ‌నా చౌద‌రి చెప్పారు. చంద్ర‌బాబు నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి రాజీనామా చేశామ‌ని, మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసినందున ఎంపీలుగా పార్ల‌మెంట్ లో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని తెలిపారు. రాష్ట్రం విష‌యంలో రెండు జాతీయ పార్టీలూ దొందూ దొందూలాగే వ్య‌వ‌హ‌రించాయ‌న్నారు. ఒక జాతీయ పార్టీన‌మ్మ‌క ద్రోహం చేసింద‌ని, మ‌రో జాతీయ‌పార్టీ మోసం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాజీనామా త‌ప్ప వేరేమార్గం క‌న‌ప‌డ‌లేద‌ని తెలిపారు. అంత‌కుముందు …గురువారం సాయంత్రం కీల‌క‌ప‌రిణామం చోటుచేసుకుంది. మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యం చెప్పేందుకు బుధ‌వారం రాత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా ఫోన్ లో అందుబాటులోకి ప్ర‌ధాని గురువారం సాయంత్రం స్వ‌యంగా ముఖ్య‌మంత్రికి ఫోన్ చేశారు. తాజా రాజకీయ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబుతో మాట్లాడారు. మంత్రివ‌ర్గం నుంచి వైదొలిగిన కార‌ణాల‌ను చంద్ర‌బాబు ప్ర‌ధానికి వివ‌రించారు.