లెనిన్ విగ్ర‌హాన్ని కూల్చేసింది…పెట్టిన‌వాళ్లే

BJP's Ram Madhav Says Lenin's Statue Removed By Prominent Landowners
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విగ్ర‌హాల విధ్వంసంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ అధికార ప్ర‌తినిధి రామ్ మాధ‌వ్ ఖండించారు. త్రిపుర‌లో విగ్ర‌హాల విధ్వంసం అన్న‌ది ఎక్కడా జ‌ర‌గ‌లేద‌ని రామ్ మాధ‌వ్ వ్యాఖ్యానించారు. బెలోనియాలో లెనిన్ విగ్ర‌హాన్ని ఎవ‌రూ కూల్చివేయ‌లేద‌ని, ప్ర‌వేట్ భూమిలో ఇది ఏర్పాటై ఉండ‌డంతో ఈ విగ్ర‌హాన్ని భూ య‌జ‌మానులే తొల‌గించార‌ని, విగ్ర‌హాన్ని గ‌తంలో భూ య‌జ‌మానులే ప్ర‌తిష్టించుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. మీడియాలో దీనిపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింద‌ని ఆరోపించారు. అంత‌ర్జాతీయ నేత‌ల‌ను గౌర‌వించాల‌ని ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెనర్జీ హిత‌వు ప‌ల‌క‌డంపై రామ్ మాధ‌వ్ అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. నేత‌ల‌ను ఎలా గౌర‌వించాలో త‌మ‌కు తెలుస‌ని, ఇత‌ర రాష్ట్రాల వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చేముందు సొంత‌రాష్ట్ర ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకోవాల‌ని సూచించారు.

త్రిపుర‌లో 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వామ‌పక్షాల‌ను ఓడించి ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన కొన్నిరోజుల‌కే బెలోనియాలో లెనిన్ విగ్ర‌హాన్ని బుల్డోజ‌ర్ తో కూల్చివేయ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వామ‌ప‌క్షాల ఓట‌మి, కాషాయ‌ద‌ళం గెలుపుకు గుర్తుగా బీజేపీ కార్య‌క‌ర్త‌లే లెనిన్ విగ్ర‌హాన్ని కూల్చివేశారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప‌శ్చిమబెంగాల్ లో ఒక‌ప్పుడు వామ‌ప‌క్షాల‌ను తీవ్రాతితీవ్రంగా వ్య‌తిరేకించే తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తాబెనర్జీ కూడా…క‌మ్యూనిస్టు నాయ‌కుడైన లెనిన్ విగ్ర‌హాన్ని కూల్చివేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. లెనిన్ విగ్ర‌హం కూల్చిన మ‌రుస‌టిరోజే త‌మిళ‌నాడులో పెరియార్ విగ్ర‌హాన్ని, కోల్ క‌తాలో శ్యాంప్ర‌సాద్ ముఖ‌ర్జీ విగ్ర‌హాల‌ను కూడా కూల్చివేయ‌డంతో త‌క్ష‌ణ‌మే స్పందించిన మోడీ..విగ్ర‌హాల వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు.