రెండో బౌలర్‌గా అశ్విన్‌

రెండో బౌలర్‌గా అశ్విన్‌

టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పలు రికార్డులను సృష్టించాడు. భారత్‌ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. 350 వికెట్లతో అనిల్‌ కుంబ్లే తొలి స్ధానంలో ఉండగా, 300 వికెట్లతో అశ్విన్‌ రెండో స్ధానంలో ఉన్నాడు. అదే విధంగా స్వదేశంలో వేగవంతంగా 300 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. తొలి స్ధానంలో శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్నాడు.

కాగా 48 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను మురళీధరన్‌ సాధించగా, 49 మ్యాచ్‌ల్లో అశ్విన్‌ ఈ రికార్డును సాధించాడు. భారత్‌ తరుపున స్వదేశంలో వేగవంతంగా 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు భారత దిగ్గజ ఆటగాడు అనిల్‌ కుంబ్లే 52 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో హెన్రీ నికోలస్‌ వికెట్‌ పడగొట్టి అశ్విన్‌ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో మొత్తంగా 14 వికెట్లు పడగొట్టాడు.