Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కథువా దారుణంపై బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంగ్లిష్ చానల్ తో మాట్లాడిన ఆమె తన కూతురిని దారుణంగా చంపినవారిని ప్రాణాలతో వదిలిపెట్టొద్దని, తన బిడ్డను చంపిన వారిని ఉరితీయాలని కోరింది. తన కూతురు కనపడకుండా పోయిన వారం తర్వాత ఒక రోజు తన కలలోకి వచ్చిందని, తనలోని ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నదానిలా ఇంటిముందు తన కూతురు కూర్చున్నట్టు ఆ కలలో కనపడిందని తెలిపింది. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఆ కల రాలేదని, తన కూతురు న్యాయం కోసం ఎదురుచూస్తోందని, ఎప్పుడైతే తనకు న్యాయం జరుగుతుందో, నిందితులను ఉరితీస్తారో అప్పుడు తన కూతురు మళ్లీ తనకు కలలో కన్పిస్తుందన్న నమ్మకం తనకుందని బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదనతో చెప్పింది.
తమ కుటుంబంలో గతంలో చోటుచేసుకున్న మరో విషాదాన్ని కూడా ఆమె మీడియాకు చెప్పింది. బాధితురాలి తల్లి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ప్రమాదాల్లో కోల్పోయింది. వాళ్లు మరణించిన బాధనుంచి తేరుకుని మిగిలిన కూతురును కంటికిరెప్పలా పెంచుకుంటుండగా… ఈ దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ప్రమాదాల్లో కోల్పోయానని, ఇప్పుడు మూడో పాప ఇలా దూరమైందని విలపించింది. కథువా దారుణంలో మరో విషాదం ఏమిటంటే… బాధితురాలి తల్లి కూతురి ఆచూకీ కోసం… ఆ చిన్నారిపై జరిగిన దారుణానికి సూత్రధారి అయిన గుడిపూజారినే అడగడం. బాధితురాలి కుటుంబం సాంజీ రామ్ ను ఎంతగానో నమ్మేది. పవిత్రమైన ఆలయానికి పూజారిగా ఉన్న వ్యక్తి ఇలా ఎలా చేయగలిగాడో… ఇప్పటికీ బాధితురాలి తల్లికి అర్ధం కావడం లేదు.
మీడియాతో ఆమె ఇదే చెప్పింది. తన కూతురు కన్పించకుండా పోయిన మరుసటిరోజు తాను సాంజీరామ్ ను కలిశానని, పాప తిరిగొస్తుందని ఆయన చెప్పారని ఆమె గుర్తుచేసుకుంది. ఆయనను తాము ఎంతగానో నమ్మామని, కానీ ఆయనే ఇలా చేశారని, ఓ పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా ఎలా చేయగలిగాడని ఆమె ప్రశ్నించింది. తన కూతురి మృతదేహం దొరికినప్పుడు కొందరు మహిళలు ఏవేవో మాట్లాడారని, తనను కోతులు లేదా ఇతర జంతువులు చంపేసి ఉంటాయని నమ్మించే ప్రయత్నంచేశారని, కానీ పైనున్న దేవుడు అన్నీ చూస్తున్నాడని ఆమె విలపిస్తూ చెప్పింది. న్యాయమూర్తిపై బాధితురాలి తల్లి విశ్వాసం వ్యక్తంచేసింది. న్యాయమూర్తి మీద తనకు నమ్మకముందని, తన బిడ్డకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించింది.