దేశవ్యాప్తంగా తన ప్రభావం కోల్పోతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత, అసోం మాజీ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతా బయోలో కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మహిళ నేత అని మార్చి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొదటి క్లూ ఇచ్చారు. సుస్మితా దేవ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్ త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సుస్మితా దేవ్ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో భేటీ అవ్వనున్నట్లు తెలిసింది.ఈ ఏడాది మార్చిలోనే సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వార్తలు వచ్చాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై అసంతృప్తిగా ఉన్న సుస్మితా దేవ్ పార్టీని వీడతారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్ ఖండించింది. ఇక సుస్మితా దేవ్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు.
‘‘సుస్ముతా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యువ నాయకులంతా పార్టీని వీడితున్నారు.. పార్టీని బలోపేతం చేయడానికి మేం సరిగా ప్రయత్నించడం లేదంటూ వృద్ధులపై నిందలు వేస్తున్నారు’’ అంటూ కపిల్ సిబాల్ విమర్శించారు.ఇక సుస్మితా దేవ్ రాజీనామా గురించి తనకు తెలియదని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా తెలిపారు. సుస్మితా దేవ్ అసోం కాంగ్రెస్ నాయకుడు ప్రభావవంతమైన బెంగాలీ నాయకుడు సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. సుస్మితా దేవ్ గతంలో తన తండ్రికి పట్టున్న సిల్చార్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.