ఎట్టకేలకి పోలీసుల ఎదుట రవి ప్రకాష్…మోసం చేశారట ?

another blow to raviprakash

ఇప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు తీసిపుచ్చడంతో నిన్న సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవి ప్రకాశ్‌ సంతకాలను ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ.. అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాశ్.. ముందస్తు బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం.. ఆయనకు సూచించింది. దీంతో ఆయన పోలీసుల ముందు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. జూన్ 05వ తేదీన బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్‌కు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నటుడు శివాజీ విచారణకు హాజరు కాలేదని కోర్టు అనుమతితో శివాజీపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు టీవీ 9కు సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు సినీ నటుడు శివాజీ, మూర్తిపైనా కేసులు నమోదు కాగా  మూర్తిని మాత్రమే పోలీసులు పలు దఫాలుగా విచారించారు. శివాజీ, రవిప్రకాశ్‌ విచారణకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. అలంద మీడియా ఫిర్యాదుతో పోలీసులు టీవీ 9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  విచారణ అనంతరం రవి ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ కు చెందిన ఇద్దరు ధనిక వ్యాపారవేత్తలు తనున్ను మోసగించి టీవీ9ను అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ వివరాలను పోలీసులకు తెలిపానని అన్నారు. ఒక వ్యక్తిగా ధనికస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని రవి ప్రకాశ్ తెలిపారు. ఎడ్యుకేషన్ మాఫియా, కాంట్రాక్టర్ మాఫియా, బిల్డర్ మాఫియా.. మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకొని వాస్తవాలను బయటకు రాకుండా కుట్ర పన్నుతున్నాయి. దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న కారణంగానే నాపై అక్రమ కేసులు నమోదు చేశారని రవి ప్రకాశ్ ఆరోపించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వాస్తవం కోసం, సమాజ హితం కోసం పోరాటం చేస్తానన్నారు. తనకు నైతికంగా మద్దతిస్తున్న వారికి రవి ప్రకాశ్ కృతజ్ఞతలు చెప్పారు.