పాత కక్షలు మనసులో ఉంచుకున్న కొందరు పుట్టినరోజు వేడుకలకు పిలిచి ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో చోటుచేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని గణేశ్ ఆలయం ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీకాంత్‌కు, లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలోని సంపత్‌కు మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సంపత్ పుట్టినరోజు కావటంతో మిర్యాల శ్రీకాంత్‌ను ఇందిరానగర్ వద్దకు గురువారం అర్ధరాత్రి పిలిచారు.
కేక్ కోసిన అనంతరం సంపత్‌తోపాటు అతడి స్నేహితులు భరత్, అఖిల్, మరికొందరు ముందుగా తెచ్చుకున్న గొడ్డలి, కర్రలతో శ్రీకాంత్‌పై దాడి చేసి అక్కడ్నుంచి పారిపోయారు. శ్రీకాంత్ శరీరంపై 14 చోట్ల గాట్లు పడి తీవ్రంగా రక్తస్రావమైంది. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా..మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీకాంత్ సోదరి సింధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.