టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై దాడి కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఫామ్‌హౌజ్‌లో దొరికిన గుత్తా సుమన్ చరిత్ర మొత్తాన్ని ఓస్‌ఓటీ పోలీసులు బయటకు లాగుతున్నారు. ఈ నేపథ్యంలో పేకాట ఆడిస్తూ పట్టుబడిన సుమన్ చౌదరి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుమన్ చౌదరి ఫోన్లో పలువురు వీఐపీల నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెజవాడ, హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు.. ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతో సుమన్‌కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గుత్తా సుమన్ ఫామ్ హౌజ్‌లను అద్ధెకు తీసుకొని పేకాట ఆడిస్తుంటాడని, విజయవాడలోని మామిడి తోటలో గుత్తా సుమన్ పేకాట క్లబులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమన్ చౌదరిపై విజయవాడ లో భూ కబ్జా కేసు కూడా నమోదైంది. బడా రాజకీయ నేతలతో ఫొటోలు దిగి తనకు పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఎన్జీవో పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన సుమన్ చౌదరి, ఏపీలో పలు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య పట్టుబడ్డారు. మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా భద్రయ్య పనిచేశారు. ఆయనతోపాటు వాసవీ డెవలపర్స్ రాజారాం, మరో రియల్టర్ మద్దుల ప్రకాశ్ అరెస్టయ్యారు. అయితే నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ వద్ద విల్లాను ప్రధాన నిందితుడు గుట్ట సుమన్ చౌదరి ఒకరోజుకి అద్దెకు తీసుకున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో విల్లాను సుమన్ అద్దెకు తీసుకోగా.. రవీంద్ర ప్రసాద్‌కు తెలిసే జూదం జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా హైదరాబాద్ నగర శివారుల్లోని హీరో నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్ కాలనీలోని ఓ విల్లాలో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 30 పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6.77 లక్షల నగదు, 33 మొబైల్ ఫోన్లు, 29 పేకాట సెట్లు, రెండు కాసినో కాయిన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.