మత్స్యకారులపై కాల్పులు

మత్స్యకారులపై కాల్పులు

భారత్‌కు చెందిన మత్స్యకారులపై పాకిస్థాన్‌ మారిటైమ్ సెక్యూరిటీ విభాగం కాల్పులకు తెగబడింది. పాక్ విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పుల్లో మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ మత్స్యకారుడు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. గుజరాత్‌లోని ఓఖా పోర్టు నుంచి పడవలో ఎనిమిది మంది అక్టోబరు 25న అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద శనివారం సాయంత్రం పడవలో ఉన్న మత్స్యకారులపై పాకిస్థాన్‌ సముద్ర భద్రతా ఏజెన్సీకి చెందిన సిబ్బంది కాల్పులు జరిపారు.

ఈ ఘటనపై స్పందించిన భారత్… మత్స్యకారులను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడింది. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దౌత్యపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఓ అధికారి తెలిపారు. ‘మహారాష్ట్రకు చెందిన మత్స్యకారుడు చేపలవేట పడవ ‘జల్పారీ’పై ఉండగా పీఎంఎస్ఏకు చెందిన సైనికులు కాల్పులు జరపడంతో చనిపోయాడు’ అని దేవ్‌భూమి ద్వారక ఎస్పీ సునీల్ జోషి వెల్లడించారు.

పడవలో మొత్తం ఏడుగురు ఉన్నారని, చనిపోయిన మత్స్యకారుడు రమేశ్ చామ్రేగా గుర్తించామన్నారు. గాయపడిన వ్యక్తిని ఓఖా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. చామ్రే కాబిన్‌లో ఉండగా కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలైనట్టు బోటు యజమాని జయంతిభాయ్ రాథోడ్ చెప్పారు. అతడి గుండెల్లోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయాడన్నారు. బోటు నడిపే కెప్టెన్‌ గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.

సముద్రంలో వేటకు వెళ్లే భారతీయ మత్స్యకారులపై పాకిస్థాన్ తరుచూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వారిని బంధించడం లేదా కాల్పులు జరపడం వంటివి చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌కు చెందిన 270 మంది మత్స్యకారులు, 49 మంది సాధారణ ఖైదీలు తమ జైళ్లలో ఉన్నట్టు పాకిస్థాన్ వెల్లడించింది. ఇదే సమయంలో పాక్‌కు చెందిన 77 మంతి మత్స్యకారులు, 263 మంది పౌరులు భారత్ కస్టడీలో ఉన్నారు.