కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై మూకదాడి జరిగింది. శుక్రవారం వర్కవుట్లు చేసేందుకు స్నేహితులతో కలిసి సంయుక్త బెంగళూరులోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఆమె వేసుకున్న దుస్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ దుస్తులు ధరించి పబ్లిక్‌లోకి ఎలా వస్తావంటూ దూషణలకు దిగింది. పార్కులో ఉన్న మరికొందరు కూడా సదరు మహిళతో కలిసి సంయుక్తతోపాటు ఆమె స్నేహితులపై దాడి చేశారు. కాగా దాడికి దిగిన మహిళను కవితారెడ్డిగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనతో షాక్ తిన్న హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించారు.
“స్పోర్ట్స్ బ్రా వేసుకుని బయటకు వచ్చినందుకు చెప్పరాని మాటలు అన్నారు. నా స్నేహితురాలు ఏమీ అనకముందే ఆమెను కొట్టడానికి వెళ్లారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మాకు సహాయం చేయాల్సింది పోయి మరికొందరు మగవాళ్లు ఆమెకు తోడుగా నిలిచారు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు” అని సంయుక్త వాపోయారు. ట్విటర్‌లోనూ తనపై దాడి చేసిన కవితారెడ్డి అనే మహిళ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బెంగళూరు పోలీసులను కోరారు. తమ దగ్గర మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. కాగా సంయుక్త హెగ్డే తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తెలుగులో ‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నటించారు.
