కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి ఘటన కలకలం రేపింది. మాజీమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన తన్వీర్ సైత్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి మైసూరులో జరిగిన వివాహానికి హజరైన తన్వీర్‌పై పర్హాన్ పాషా అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి యత్నించాడు. ఎమ్మెల్యే అనుచరులు, బాడీగార్డులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఎమ్మెల్యేలను వెంటనే కొలంబియా ఆసియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన పాషాను ఉదయగిరి ప్రాంతానికి చెందిన కళాకారుడిగా పోలీసులు గుర్తించారు. తన ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను గతంలో రెండు మూడుసార్లు కలిశాడని, ఎన్నిసార్లు తిరిగినా ఉద్యోగం రావడం లేదన్న ఆక్రోశంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.