పంజాబ్‌లో తమ బంధువులపై భయంకరమైన దాడి జరిగిందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై దాడి చేసిందో ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశాడు. దీనిలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సురేశ్ రైనా ట్విటర్ ద్వారా విన్నవించాడు. దీనిపై స్పందించిన సీఎం అమరీందర్ సింగ్.. రైనా బంధువులపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కేసును త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్టు 29న నలుగురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి నిద్రిస్తున్నసమయంలో అకస్మాత్తుగా దాడి చేసి రైనా మేనమామ అశోక్‌ను హత్య చేయగా.. ఆయన భార్య ఆశా రాణితో సహా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రైనా కజిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆశా రాణి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరోవైపు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటనకు పాల్పడింది ‘కాలే కచ్చే గ్యాంగ్’ అని తెలినప్పటికీ సాధ్యమైన అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు.