మద్యంమత్తులో యువకులు ఓ టీవీ నటిపై రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురి చేశారు. ఆమెను వెంబడించి భయాందోళనకు గురి చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
టీవీ నటి ప్రాచీ తెహ్లాన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. మంగళవారం అర్ధరాత్రి భర్తతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నలుగురు వ్యక్తులు కారును వెంబడించారు. మధువన్ చౌక్‌కు చేరుకోగానే ఆ దుండగులు కారును దాటి రోడ్డుకు అడ్డంగా వారి వాహనాన్ని నిలబెట్టారని ప్రాచీ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ క్రమంలో దుండుగులను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లామని ఆమె తెలిపారు. అయినా వారు తమను వెంబడించి వేధింపులకు దిగారని, తమ కాలనీ గేటు వరకూ తమను ఫాలో అయ్యారని చెప్పారు. ప్రశాంత్ విహార్‌లోని తాము ఇంటికి చేరుకోగానే వారు వాహనం నుంచి దిగి తనను, తన భర్తను అసభ్యంగా దూషిస్తూ బెదిరించారని, తమపై దాడికి పాల్పడ్డారని ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదుతో పోలీసులు స్పందించి ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మద్యంమత్తులో వారు ఆ విధంగా చేశారని తెలుస్తోంది.
కాగా ప్రాచీ తెహ్లాన్ భారత బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. గతంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2010లో కామన్వెల్త్ క్రీడా పోటీలకు ప్రాతినిథ్యం వహించింది. అనంతరం 2016లో టీవీ నటిగా మారింది. ‘దియా ఔర్ బాతీ హమ్’ అనే టీవీ షోతో గుర్తింపు పొందింది. 2017లో పంజాబీ సినిమా ‘అర్జన్’లో ప్రాచీ నటించింది.