మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు నిర్వహించే కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని రోజాపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ దాడికి ఒడిగట్టాడు. గతంలో రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పని చేశాడు. ఆ సమయంలో రోజా జూనియర్ అసిస్టెంట్ అయిన రామకృష్ణ కింద పని చేసేవారు.
గత ఏడాది రామకృష్ణ పదోన్నతిపై బోధన్ మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్ళాడు. బదిలీపై వెళ్లిన నుంచి తరచుగా రామకృష్ణ రోజాకు ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలిసింది. గత నెల రోజులుగా రామకృష్ణ ఫోన్ చేసిన రోజా స్పందించకపోవడంతో ఆవేశానికి గురైన రామకృష్ణ సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రోజాపై దాడి చేశాడు.
అంతేకాకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశాడు. ఈ దాడిలో రోజా ముక్కుకు తీవ్ర గాయం అయింది. వెంటనే రోజాను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో రోజా ఫిర్యాదు చేయగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను దాడి చేసే దృశ్యాలు స్థానికులు ఫోన్‌లో రికార్డు చేశారు. అతని తీరుపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.