తప్పతాగి ఆటోను ఢీ కొట్టిన ఆడి కారు

తప్పతాగి ఆటోను ఢీ కొట్టిన ఆడి కారు

తప్పతాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ మాదాపూర్‌లో తెల్లవారు జామున ఆడి కారు ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి కారణమైన వారితో పాటు తండ్రి కటకటాలపాలయ్యారు. మల్లాపూర్‌లో నివాసం ఉంటూ గోవాలో ఎంఎస్‌ చదువుతున్న వాకిటి సుజిత్‌ రెడ్డి(24) స్నేహితుడు ఆశిష్‌తో పాటు మరో ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్‌ సమీపంలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకొని మద్యం సేవించారు.

మద్యం మత్తులో ఈ నెల 27 ఉదయం 5.30 గంటల సమయంలో ఆశిష్‌తో కలిసి ఆడి కారులో కృష్ణానగర్‌ బయలు దేరారు. అతి వేగంగా వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ఢీ కొట్టడంతో వెనక సీట్లో కూర్చున్న వై.ఉమేష్‌ కుమార్‌ (37, పబ్‌లో వర్కర్‌) ఎగిరి ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కారులో ఉన్నవారు ఆగకుండా ముందుకు వెళ్లి కారు నెంబర్‌ ప్లేట్లు తీసేసీ ఇనార్బిట్‌ మాల్‌ వైపు పరిగెత్తారు. అక్కడి నుంచి సుజిత్‌రెడ్డి తండ్రి రఘునందన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. అక్కడి నుంచి ఆటోలో రావాలని చెప్పాడు. కొడుకును డీడీ కాలనీలో దాచిపెట్టారు.

ఈ నెల 28న డ్రైవర్‌ ప్రభాకర్‌ (52) కారు నడిపాడని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీసీ పుటేజీలో యువకులు పరిగెత్తినట్లు కనిపించడంతో పోలీసులు తమ స్టయిల్‌లో విచారించారు. డైవర్‌ను మార్చే ప్రయత్నం చేశామని ఒప్పుకోవడంతో రఘునందన్‌ రెడ్డిపై ఐపీసీ 202, 203, 205,212,419,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెంబర్‌ ప్లేట్లు తీస్తుండగా చూసిన ఇద్దరు వ్యక్తులను బెదిరించారు. కారు నడిపిన సుజీత్‌ రెడ్డితోపాటు, అశిష్‌పై 304(2), 201,506, రెడ్‌ విత్‌ 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.