‘‘చాలా గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం’’ అని టీ20 వరల్డ్‌కప్-2021 చాంపియన్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసీస్‌కు ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ టైటిల్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు.
నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవగా.. మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం కెప్టెన్ ఫించ్ మాట్లాడుతూ.. వార్నర్, ఆడం జంపా, మార్ష్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘తన పని అయిపోయిందంటూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే వార్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం జంపా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మార్ష్ ఈరోజు అద్భుతంగా ఆడాడు. వేడ్ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్ తన పనిని పూర్తి చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు.