న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడితే వెంటనే ఏ అంబులెన్స్‌కో ఫోన్ చేయాలి. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం ఆ అవసరం లేకుండా గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన ఆటోనే అంబులెన్స్‌గా మార్చి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దేశరాజధాని నగరం ఢిల్లీలో హర్జిందర్ సింగ్ అనే (76) అనే వ్యక్తి ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటాన్ని చూశాడు. ఓ వైపు ఆటో నడుపుకుంటూనే సమాజానికి తనవంతుగా ఏమైనా చేయాలని హర్జిందర్‌సింగ్ నిర్ణయించుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన వారి కోసం తన ఆటోలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటిల్ బాటిల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తాను వెళ్లే మార్గంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతున్నాడు. నేను వచ్చే మార్గంలో ఎవరైనా ప్రమాదానికి లోనైతే వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తా. కనీసం రోజుకు ఒక మనిషికైనా సాయమందిస్తుంటానని హర్జిందర్ సింగ్ చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి కోసం ఈ ఆటో అంబులెన్స్ అని తన ఆటోపై రాయించాడు హర్జిందర్‌సింగ్. వృద్యాప్య దశలో ఉన్నా ఓ వైపు ఆటో నడుపుతూ..మరోవైపు ఆపదలో ఉన్నవారిని కాపాడుతున్న హర్జిందర్‌సింగ్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.