అనంతపురం జిల్లాలో 9 కిలోమీటర్ల పరిధిలో రెండు ఘెర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. పామిడి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.
గార్లదిన్నె నుంచి పెద్దవడగూరుకు వ్యవసాయ పనులకు వెళ్తుండగా కూలీలు ఈ ప్రమాదానికి గురయ్యారు. పెద్దవడగూరు క్రాస్‌కు వెళ్లేందుకు రాంగ్ రూట్లో ఆటో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను శంకరమ్మ, నాగవేణ, సావిత్రి, చౌడమ్మ, సుబ్బమ్మగా గుర్తించారు. మృతులంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ వాసులుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పామిడి వద్ద జరిగిన ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగానే మరో ప్రమాదం జరిగింది. మిడుతూరు హైవేపై ఉన్న బాటసారుల పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.