దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో పోటీ తారస్థాయికి చేరుకుంది. చాలా కంపెనీలు తక్కువ ధరకే ఎక్కువ దూరం వెళ్లే కార్లు, స్కూటర్లు, బైకులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి.
చాలా ఎలక్ట్రిక్ కార్లు కంపెనీలు ఎక్కువగా కిమీ రేంజ్ మీద దృష్టి సారిస్తున్నాయి. థర్మల్ మేనేజ్ మెంట్, కొత్త బ్యాటరీ టెక్నాలజీల సహాయంతో మార్కెట్లోకి కార్లను తీసుకొనివస్తున్నాయి. తాజాగా చైనాలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్యువి కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు అని కంపెనీ వాగ్దానం చేసింది. అవతార్ ఈ11గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కేవలం నాలుగు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అని సంస్థ పేర్కొంది. హువావే, క్యాటెల్, చంగన్ ఆటోమొబైల్స్ అనే మూడు కంపెనీల జాయింట్ వెంచర్ అయిన అవతార్ టెక్నాలజీ ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది.
ఈ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేసిన మొదటి హై ఎండ్ ప్యూర్ ఆల్ ఎలక్ట్రిక్ వేహికల్ ఇది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కారు స్పోర్టీ డిజైన్ తో వస్తుంది. AVATR E11 ఎలక్ట్రిక్ ఎస్యువి పొడవు 4.8 మీటర్లు. ఈ కారును చైనా మార్కెట్లో 300,000 యువాన్ల ధరకు లాంఛ్ చేశారు. ఇది మన దేశంలో దాదాపు ₹35 లక్షలకు సమానం. ఈ ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యువిని వచ్చే ఏడాది మూడవ త్రైమాసికంలో డెలివరీ చేయలని చూస్తున్నారు. రాబోయే మరో మూడు సంవత్సరాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు తెలిపారు. మన దేశంలోకి ఎప్పుడు తీసుకొనివస్తారు అనే విషయం మీద స్పష్టత లేదు.