టీ20ల్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో వేగంగా 7000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును బాబర్ ఆజమ్ తిరగరాశాడు. పొట్టి క్రికెట్‌లో గేల్ 192 ఇన్నింగ్స్‌ల్లో 7000 పరుగుల మార్కును చేరుకోగా.. బాబర్ కేవలం 187 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని క్రాస్ చేశాడు. పాక్‌లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా సదరన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ పంజాబ్ తరఫున 59 పరుగులు చేసిన బాబర్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ క్రమంలో టీ20ల్లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(212)ని మూడో స్థానానికి, ఆరోన్ ఫించ్(222), డేవిడ్ వార్నర్(223)లను నాలుగు, ఐదు స్థానాలకు వెనక్కు నెట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో పాక్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచిన బాబర్.. ఓవరాల్‌గా 7000 పరుగుల మార్కును అందుకున్న 30వ బ్యాటర్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 56 ఇన్నింగ్స్‌ల్లో 2204 పరుగులు చేసిన బాబర్.. అత్యధిక పరుగుల జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు.