తెలంగాణలో బాబు ఎఫెక్ట్..టీడీపీ ఓట్లపైనే టార్గెట్.!

Babu effect in Telangana..TDP votes are the target!
Babu effect in Telangana..TDP votes are the target!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు..పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న టీడీపీ మద్ధతు దారులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే వేరే చోట్ల ఆందోళనలు చేసిన పెద్ద ప్రభావం చూపవు గాని, తెలంగాణలోనే కాస్త ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎంత కాదు అనుకున్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా జీరోలో ఉంది..కానీ రాజకీయంగా టి‌డి‌పిని అభిమానించే వారు ఇంకా ఉన్నారు.

ఎన్నికల సమయంలో వారు పరిస్తితులని బట్టి కాంగ్రెస్ లేదా బి‌ఆర్‌ఎస్ పార్టీలకు మద్ధతు ఇచ్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పిని అభిమానించే మెజారిటీ ఓట్లు బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు తెలిపారు. హైదరాబాద్ సహ ఇతర రాష్ట్రాల్లో టి‌డి‌పి మద్ధతు దారులు బి‌ఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అంటే టి‌డి‌పి మెజారిటీ మొత్తం బి‌ఆర్‌ఎస్ వైపుకు వెళ్లింది. అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు కూడా మారాయి. జగన్ చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి.

ఇదే సమయంలో మొదట హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా నిరసన తెలిపారు. తర్వాత నిదానంగా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా టి‌డి‌పిని అభిమానించే వారు నిరసన తెలియజేశారు. ఇక ఇది రాజకీయంగా కూడా ప్రభావితం అవుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీలో కొందరు నేతలు చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే కొందరు చంద్రబాబుపై అభిమానంతో ఖండిస్తుంటే..మరికొందరు టి‌డి‌పి ఓట్ల కోసం అరెస్ట్‌ని ఖండిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో టి‌డి‌పి ప్రభావం ఉంటుందని అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పి నేతలు బాబుకు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో బాబు అరెస్ట్ ప్రభావం ఎక్కువగానే ఉంది.