మండలంలోని కుచినెర్లలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఓ చిన్నారి మృతి కేసును పోలీసులు ఛేదించారు. బాలుడికి కన్న తండ్రే పురుగుమందు తాగించి కాటికి పంపినట్లు నిర్ధారించారు. ఎస్ఐ కుర్మయ్య కథనం మేరకు.. నందిన్నెకు చెందిన కర్రెప్పతో కుచినెర్లకు చెందిన నర్సమ్మకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి భరత్ జన్మించాడు. భార్యాభర్తలు గొడవపడి ఏడాది కాలంగా నర్సమ్మ పుట్టింట్లో ఉంటోంది.
సోమవారం కర్రెప్ప బాలుడు భరత్‌ను బలవంతంగా బయటకు తీసుకొచ్చి కాసేపటి తర్వాత తిరిగి వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడి నోటి నుంచి నురుగ, వాసన రావడంతో గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకలోని రాయచూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. నర్సమ్మ ఫిర్యాదు మేరకు కర్రెప్పపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.