తాత చేతుల్లోంచి జారిపడి చిన్నారి మృతి

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాక్ డౌన్ సమయంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఓ తాత తన మనవరాలిని ఎత్తుకొని భవనం టెర్రస్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్నాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తూ తాత చేతుల్లోంచి ఆ చిన్నారి జారిప‌డి మ‌ర‌ణించింది.అసలు ఏం జరిగింది అంటే… బెంగళూరు న‌గ‌రంలోని రాజాజీనగర్‌ మారుతీ లేఅవుట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లైన‌ ప్రియాంక, వినయ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అన్వీ అనే ఆరు నెలల కూతురు ఉంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లో ఖాళీగా ఉండ‌టంతో విన‌య్ దంప‌తులు ఇల్లు దుల‌పాల‌ని అనుకున్నారు. దీంతో పాప‌ను టెర్ర‌స్‌పైకి తీసుకెళ్లి ఆడించ‌మ‌ని విన‌య్ త‌న‌ తండ్రికి తెలిపాడు. విన‌య్ తండ్రి మ‌న‌వ‌రాలిని తీసుకుని పైకి వెళ్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు పాప చేతుల్లోంచి జారిప‌డింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వారు మ‌రో ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. ఇంతలో ఆలస్యం కావడంతో మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండగానే పాప మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందింది. కాగా ఈ విషయంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.