పోలీస్ భద్రత పై దృష్టి పెట్టిన ప్రభుత్వం: తెలంగాణ వ్యాప్తంగా 25 ముబైల్ సేఫ్టీ కేంద్రాలు

దేశమంతా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నాయి. ఆ వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలురకాల నియమాలను, నిబంధనలు, పరిశుభ్రతలను పాటిస్తుంది. అందులో ముఖ్యంగా లాక్ డౌన్ అనేది ప్రధానమైన ఆయుధంగా చెప్పవచ్చు. అయితే తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ జనాలను కట్టడి చేసింది. పోలీసులను రంగంలోకి దింపి ప్రజలు ఇంట్లోంచి బయటకు రాకుండా చేస్తోంది.

అలాగే… ప్రజల సౌకర్యార్థం అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అయితే తాజాగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కోసం పోలీస్‌శాఖ మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లును తీసుకువచ్చింది. పోలీస్‌ సిబ్బంది రక్షణకు మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తాజాగా వెల్లడించారు. డీజీపీ కార్యాలయం, రాచకొండ కమిషనరేట్‌లో ఇప్పటికే మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

అదేవిధంగా ఇదే తరహాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. కంటోన్మెంట్‌ జోన్లు, లాక్‌డౌన్‌ లో విధులు నిర్వహిస్తున్న వారు, చెక్‌పోస్టుల వద్ద బందోబస్తులో ఉండే సిబ్బందితో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఈ మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా దీంతో సిబ్బంది సేఫ్టీ టన్నెల్లోకి వెళ్లి 10 సెకన్ల సమయం ఉంటే వారిపై క్రిమిసంహారక మందు స్ప్రే చేయడం ద్వారా ఏవైనా వైరస్‌లు ఉంటే చనిపోతాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.