సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన తాజా చిత్రం డేంజరస్ ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. డేంజరస్ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. ఈ విషయాన్ని స్యయంగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. పీవీఆర్, ఐనాక్స్ డెంజరస్ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ మూవీ పట్ల వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందన్నాడు.
కాగా ‘నా సినిమా డేంజరస్ లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్‌జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా’ అంటూ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మరి వర్మ ట్వీట్‌పై పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. కాగా ఇద్దరు యువుతుల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో వర్మ డేంజరస్ చిత్రాన్ని రూపొందించాడు.