భారత క్రికెట్ జట్టుకే కాదు…క్రికెట్ అభిమానులనూ ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్త! బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్ లకు అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరమయ్యారు. అటు ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్, ఇటు వెటరన్ పేసర్ ఇషాం త్ ఇద్దరూ దూరమవడం భారత్‌కు ఒక విధంగా ఆల్‌రౌండ్ దెబ్బలాంటిదే! జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని భారత జట్టు మేనేజ్‌మెంట్ కలవరపడుతోంది.
అయితే చివరి రెండు టెస్టుల వరకల్లా అందుబాటులోకి రావాలని జట్టుతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశిస్తోంది. నిజానికి టెస్టు సిరీస్‌కు సమయమున్నప్పటికీ ఆస్ట్రేలియాలో అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికిప్పుడు బయల్దేరితేనే తొలి టెస్టు ఆడగలరు. ఇదే విషయాన్ని ఆదివారం హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పారు. అక్కడ 14 రోజుల ఐసోలేషన్ తర్వాతే వారు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. అందుకే సీనియర్ ఆటగాళ్లు తొలి రెండు టెస్టులకు దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.