సామాజిక మాధ్యమాల్లో సినీ తారలను ఎంతమంది అనుసరిస్తున్నారనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే వారే పాపులర్. మొన్నామధ్య ట్విటర్ నకిలీ ఖాతాలను తొలగించినప్పుడు సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల అత్యధికంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 4,23,966 మంది ఫాలోవర్లను పోగొట్టుకున్నారు.
ఆ తర్వాత షారుక్ ఖాతాలో 3,62,382 మంది ఫాలోవర్లు తగ్గిపోయారు. ఈ విషయంపై అమితాబ్ ట్విటర్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడో కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు కావాలనే నకిలీ ఫాలోవర్లను సృష్టిస్తున్నారా? వారి పాపులారిటీ పెంచేందుకు దొంగచాటు మార్గాలను ఎంచుకుంటున్నారా? ఏమో? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే అవుననే అంటారేమో!
బాలీవుడ్ ర‌్యాపర్ బాద్‌షా నకిలీ ఫాలోవర్స్ స్కామ్‌లో ఇరుక్కున్నాడు. ఆయన తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు డబ్బులిచ్చి మరీ వ్యూస్‌ను కొనుగోలు చేశారని ముంబై పోలీసులు అంటున్నారు. దీనిపై అతనికి సమన్లు కూడా జారీ చేశారు. నిజానికి యూట్యూబ్‌లో తన వీడియో రిలీజ్ చేసిన తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించి ప్రపంచ రికార్డ్ బద్ధలు కొడుదామనుకున్నాడు బాద్‌షా. అనుకున్నట్టుగానే అతని “పాగల్ హై” సాంగ్ వీడియోకు తొలి రోజే అత్యధికంగా 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
దీంతో తొలి 24 గంటల్లో అత్యధిక వీక్షణలు సంపాదించిన కొరియన్ బ్యాండ్ బీటీఎస్ వీడియో రికార్డును తుడిచిపెట్టుకుపోయిందని ర్యాపర్ చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్తను గూగుల్ ఖండించడం గమనార్హం. మరోవైపు డీసీపీ నందకుమార్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. “యూట్యూబ్‌లో తన వీడియో ద్వారా ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టాలనుకున్నాడు. 7.2 కోట్ల వ్యూస్‌కు గానూ సదరు కంపెనీకి రూ.72 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు అతని మిగతా పాటలను, దాని వ్యూస్‌ను కూడా పరిశీలిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. అయితే వీటన్నింటినీ బాద్‌షా తోసిపుచ్చారు. తను ఎప్పుడూ ఇలాంటి పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు.