బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం

బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్) చీఫ్‌ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి . ఇరాక్‌, టర్కీ, రష్యా సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం పక్కా స్కెచ్ వేసి అష్టదిగ్భందనం చేసి ఆత్మాహుతికి పాల్పడేలా చేసింది. తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు ఉగ్రసామ్రాజ్య చీఫ్ బాగ్దాదీ. ఆ దుర్మార్గుడి చేతిలో దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడిన అమెరికా సామాజిక వేత్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో అమెరికా బలగాలతో పాటు సైనిక జాగిలాలు కీలక పాత్ర పోషించాయి.

సిరియాలో బాగ్దాదీ ఉన్నాడని నిర్ధారణకు వచ్చిన సైన్యం ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని పరిష గ్రామంలో బాగ్దాదీని తలదాచుకున్న ప్రాంతానికి వెళ్లాయి. యూఎస్ ఆర్మీకి చెందిన 75వ రేంజర్‌ రెజిమెంట్‌ బలగాలతో పాటు జగిలాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఆ ఇంటి పరిసరాల్లో కాల్పుల వర్షం కురిపించిన సైన్యం అందరినీ మట్టుబెట్టామనే నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడికి ప్రవేశించింది. ఇక డోర్లు బద్దలు కొట్టే అవకాశం ఉన్నా మందుగుండు పెట్టి ఉంటారన్న అనుమానంతో గోడలు బద్దలు కొట్టి లోనకు ప్రవేశించిన సైన్యం అక్కడ పొంచిఉన్న మరికొంత మంది ఉగ్రవాదులను అత్యాధునిక ఆయుధాలతో కాల్చిచంపాయి. మరికొందరు లొంగిపోయారు.

ఇదే సమయంలో తప్పించుకోవడానికి బంకర్‌లోకి దూరాడు బాగ్దాదీ. తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. ఇక, బాగ్దాదీని వెంటాడి రిస్క్ చేయొద్దని భావించిన యూఎస్ మిలటరీ జాగిలాన్ని రంగంలోకి దింపింది. రహస్య మార్గంలో పరుగులు పెడుతోన్న టాప్ టెర్రరిస్టును జాగిలం వెంటాడింది. దీంతో దిక్కుతోచని బాగ్దాదీ పరుగులు తీస్తూ, కేకలు వేస్తూ  చివరకు శరీరానికి చుట్టుకున్న సూసైడ్‌ జాకెట్‌ పేల్చుకుని తనను తాను అంతం చేసుకున్నాడు. ఇక, ఈ ఆపరేషన్, దానిలో పాల్గొన్న కుక్కపై సోషల్ మీడియాలో స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.