కంటి చూపుతో చంపాలన్నా, తొడగొట్టి వాహనాలు గాల్లో లేపాలన్నా ఒక్క బాలకృష్ణకే సాధ్యమవుతుంది. ఫ్యాక్షన్ సినిమాలకు, యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరైన ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. దీని కోసం ఏ హీరో చేయని సాహనం చేస్తున్నాడు, తొలిసారి అఘోరాగా వేషం కడుతున్నాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఓ బంగ్లా కొన్నాడట. అక్షరాలా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు జాప్కీ.కామ్ పేర్కొంది.
ఈ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఫిబ్రవరి 11న నడింపల్లి సత్య శ్రావణి నుంచి బాలయ్య ఈ ఇంటిని కొనుగోలు చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థులు కలిగి ఉన్న ఈ భవంతి 9,395 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. స్టాంప్ డ్యూటీ కింద రూ.82.5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.7.5 లక్షలు సైతం కట్టారు. కాగా గతేడాది జనవరిలో అక్కినేని నాగ చైతన్య సైతం జూబ్లీహిల్స్‌లో రూ.27.1 కోట్లు పెట్టి ఓ బంగ్లాను తన సొంతం చేసుకున్నాడు.