బాలకృష్ణ మెడకు పాత కేసు !

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ బహిరంగంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి గుర్తుండే ఉంటుంది. దీనిపై కేసు నమోదు చేయాలంటూ వైసీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బాలకృష్ణ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2017లో దాఖలైన పిటిషన్ కోసం తాజాగా అఫిడ్‌విట్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తూ బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని, ఆయన మీద ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని అప్పటి వైసీపీ ప్రధాన కార్యదర్శి ఇప్పటి జగన్ చేత బహిష్కరించబడిన ఫౌండర్ ప్రెసిడెంట్ కె.శివకుమార్‌ ఆగస్టు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల కోడ్‌ను బాలకృష్ణ ఉల్లంఘించారని, కేసు నమోదు చేయాలని కోరుతూ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చు కదా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. మరోవైపు ఎన్నికల సంఘం తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది బాలకృష్ణపై పిటిషనర్‌ లేవనెత్తిన ఆరోపణ భారత శిక్షాస్మృతి(ఐపీసీ)కి సంబంధించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో కలుగజేసుకున్న ధర్మాసనం దీనిపై అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.