టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి నోరుజారారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎవరో తనకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోటితో సమానమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాలయ్య హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ సినిమా ఇటీవల 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఏఆర్ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు, ఆస్కార్ అవార్డు అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అని పేర్కొన్నారు. సంగీత దిగ్గజం మేస్ట్రో ఇళయరాజాతో ప్రస్తావన వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్‌పై బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అవార్డుల గురించి మాట్లాడుతూ.. ‘భారత రత్న అవార్డు నా తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు, కాలి చెప్పుతో సమానం. అవార్డు ఇచ్చిన వాళ్లకు గౌరవం. ఆయనకు గౌరవం ఏంటి?. టాలీవుడ్‌కు నా కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదు.
ఎన్టీఆర్ భారతరత్న కంటే గొప్పోడు.’ అని వ్యాఖ్యానించారు.హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ కామెరూన్‌తో పోల్చుకుంటూ బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ కామెరూన్‌లాగా కాకుండా తను సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తానని వెల్లడించారు. జేమ్స్ కామెరాన్ ఒక్క సినిమాను పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పట్టిందని బాలయ్య అన్నారు. అలాగే ఒకేసారి మూడు సినిమాల్లో నటించగలిగే సత్తా ఉందని అన్నారు.
కాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.భారతరత్న పురస్కారాన్ని ఇలా కించపరచడం దారుణమని బాలయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ ఎవరో తెలియకుండానే నీ నిప్పురవ్వ సినిమాకి పనిచేయించుకున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే 1993లో బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ సినిమాకు ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.