గత ఏడాది సంక్రాంతికి సినిమాలు కూడా తేలిపోవడంతో ‘జై సింహా’కు కలిసొచ్చి ఏదో ఆడేసింది కానీ.. ఆ సినిమాలో అయితే అంత విషయం లేదు. ఈ తరం ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని పాత స్టయిల్లో ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాడు ఔట్ డేటెడ్ ముద్ర వేయించుకున్న డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్.
ఐతే ‘జై సింహా’ సూపర్ సక్సెస్ అనే ఫీలింగ్‌లో ఉన్న టీం.. మళ్లీ అదే పాత స్టయిల్లో ‘రూలర్’ చేసింది. ఈ సినిమాలో బాలయ్య లుక్స్.. దీని టీజర్, ట్రైలర్ అన్నీ కూడా నెగెటివ్ రెస్పాన్సే తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ట్రేడ్ వర్గాల్లో కూడా ‘రూలర్’పై ఏమాత్రం ఆసక్తి లేదు. బిజినెస్ జరక్క రూ.15 కోట్ల డెఫిషిట్‌తో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తాజాగా ‘రూలర్’కు ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు కానీ.. దాని తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఓవైపు ముందు వారంలో వచ్చిన ‘వెంకీ మామ’ అదరగొడుతోంది. మరోవైపు ‘రూలర్’కు పోటీగా వస్తున్న ‘ప్రతి రోజూ పండగే’కు మంచి బజ్ ఉంది. ఆ సినిమా పట్ల ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తితో ఉన్నారు. క్రిస్మస్ సీజన్లో ఇంకా ‘దబంగ్-3’, ‘దొంగ’ లాంటి డబ్బింగ్ సినిమాలు.. ‘మత్తు వదలరా’, ‘ఇద్దరి లోకం ఒకటే’ లాంటి యూత్ ఫుల్ చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి. ఇంత నెగెటివిటీ, అంత పోటీ మధ్య బాలయ్య కనుక హిట్ కొడితే అద్భుతమే అన్నట్లుంది పరిస్థితి.