Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు బాలయ్య ఎప్పుడైతే ప్రకటించాడో ఆ వెంటనే వర్మ తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమా తీస్తాను అంటూ ముందుకు వచ్చాడు. వెంటనే ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశాడు. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తాను అంటూ ప్రకటించడంతో కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి వెంటనే ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమా తీసి లక్ష్మీ పార్వతి అసలు రంగు బయట పెడతాను అంటూ ప్రకటించాడు. ఇలా మొత్తానికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర చిత్రాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రాబోతున్నట్లుగా ప్రకటనలు వచ్చాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రలు ఎన్ని వచ్చినా కూడా బాలయ్య తీయబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల వారిలో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై బాలయ్య యూ టర్న్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంత హడావుడి, వివాదాల మద్య తాను సినిమాను చేయడం వల్ల ఆ వివాదాలు తనకు కూడా అంటుకుంటాయని, ఈ హడావుడి తగ్గిన తర్వాత అంటే ప్రస్తుతం ప్రకటన వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు తన సినిమాను షురూ చేయాలని బాలయ్య భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు బాలయ్య నిలిపేసినట్లుగా సమాచారం అందుతుంది.
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఒక మంచి పొలిటికల్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు తేజకు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశంను బాలయ్య కల్పించాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలో బాలయ్య, తేజల కాంబోలో ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంతా భావించారు. కాని బాలయ్య నిర్ణయం మార్చుకోవడంతో ప్రేక్షకులు మరియు నందమూరి అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘జైసింహా’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరో వైపు వర్మ కూడా ప్రస్తుతానికి ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కకు పెట్టి నాగార్జునతో సినిమాను చేస్తున్నాడు.