నందమూరి బాలకృష్ణ- కే.యస్.రవికుమార్ కాంబినేషన్ మూవీ `జై సింహా` చక్కని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య 105వ సినిమా అదే కాంబినేషన్ లో తెరకెక్కడం ఆసక్తిని పెంచింది. రూలర్.. జడ్జిమెంట్ అనే టైటిల్స్ ని పరిశీలించి ఎట్టకేలకు రూలర్ ని ఫైనల్ చేశారు.
నటసింహా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దసరాకి భారీ యాక్షన్ మోడ్ లో ఉన్న పోస్టర్ ఒకటి రివీలైంది. ఆ పోస్టర్ కి చక్కని స్పందన వచ్చింది. తాజాగా దీపావళిని పురస్కరించుకుని బాలకృష్ణ కొత్త పోస్టర్ లో టైటిల్ ని ముద్రించి రిలీజ్ చేశారు. ఇందులో ఖాకీ డ్రెస్ లో సింగంలా కనిపిస్తున్నాడు బాలకృష్ణ. చేతిలో ఆ సుత్తి తో పక్కా గా ఫిక్సయ్యే వచ్చినట్టు కనిపిస్తోంది. ఖాకీ క్రౌర్యం కళ్లలో కనిపించకుండా ఆ గాగుల్స్ లో దాచేసినా కానీ.. ఇట్స్ బాలయ్య టైమ్ అని అభిమానులు ఫిక్సయిపోవాల్సిందే.
సింహా.. లెజెండ్ తర్వాత ఆకలి మీదున్న బాలకృష్ణకు మళ్లీ అలాంటి బ్లాక్ బస్టర్ పడాల్సి ఉంది. సీనియర్ దర్శకుడు కే.ఎస్.రవి కుమార్ ఆయనను ఎలా చూపించబోతున్నారు? అన్న ఉత్కంఠ ఫ్యాన్స్ ని నిలవనీయడం లేదు. ఇటీవలే రూలర్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఇతరత్రా బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది. సోనాల్ చౌహాన్- వేదిక ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ కానుంది.