ఎన్టీఆర్ జోలికి వెళ్లి తప్పు చేసిన బాలయ్య.

balakrishna-ntr-biopic-movie-idea-is-main-reason-for-rgv-laxmis-ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్ …ఈ పేరు వింటే తెలుగువాడి నరాల్లో కొత్త ఉత్తేజం పుడుతుంది. ఛాతీ గర్వంతో పొంగిపోతుంది. ఎన్టీఆర్ అంటే ఇష్టపడేవాళ్లకి ఆయన ఆరాధ్యుడు. ఆయనతో విభేదించేవాళ్ళు సైతం అంత తేలిగ్గా ఎన్టీఆర్ ని మాట్లాడలేరు. ఓ విధంగా చెప్పాలంటే శత్రువులు కూడా ఆయన్ని గౌరవించి జనంలో లబ్ది పొందాలనుకునేవాళ్ళు. దీనికి ఉదాహరణ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి. ఎన్టీఆర్ తో రాజకీయ పోరాటం చేసిన వై.ఎస్ ఆయన పోయాక ఆ పేరుని చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎన్ని సార్లు వాడుకున్నాడో అందరికీ తెలుసు. ఇక వైసీపీ అధినేత జగన్ సంగతి చెప్పక్కర్లేదు. బాబుని టార్గెట్ చేయడానికి పదేపదే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తారు. ఒకటిరెండు సందర్భాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు కూడా వేశారు. ఇక ఎన్టీఆర్ తో విభేదించి ఆయనని గద్దె దించిన వాళ్లంతా తమకి రాజకీయ బిక్ష ఆ పెద్దాయన చలవే అని చెబుతారు. ఆయనకి తమ జీవితంలో ఉన్నత స్థానం ఇస్తారు.

ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉండబట్టే ఆయన చనిపోయి ఇన్నేళ్లు అయినా జనం నోళ్ళలో నిత్యం ఆయన పేరు నానుతోంది. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకునే విషయంలో ఎన్టీఆర్ తో తీవ్రంగా విభేదించిన వాళ్ళు కూడా ఆమె వైఖరిని తప్పుబట్టారు గానీ ఆయన గౌరవానికి భంగం కలిగించే మాట ఎన్నడూ మాట్లాడలేదు. అయితే ఇన్నేళ్ల ఈ గౌరవ మర్యాదలకి రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమాతో భంగం కలుగుతుందేమోనని ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారు. నిజానికి ఈ విషయంలో వర్మ ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం అందరికీ అర్ధం అవుతూనే వుంది.

బాలయ్య ఎప్పుడైతే ఎన్టీఆర్ జీవిత చరిత్రని సినిమాగా తీస్తానని ప్రకటించారో అప్పటి నుంచి ఓ ఆసక్తి మొదలైంది. రైతు సినిమా లో వేషం వేయమని సర్కార్ షూటింగ్ లో వున్న అమితాబ్ ని అడగడానికి వెళ్లిన బాలయ్య అక్కడ కొద్దిసేపు దర్శకుడు రాము తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మెగా క్యాంపు మీద బురద చల్లడానికి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని వర్మ ఆకాశానికి ఎత్తేయడంతో ఆ బంధం బలపడింది. అదే సమయంలో పైసా వసూల్ ని డైరెక్ట్ చేస్తున్న పూరి కూడా వర్మ గురించి గొప్పగా చెప్పడంతో ఎన్టీఆర్ బయోపిక్ విషయాన్ని వర్మతో షేర్ చేసుకున్నారు బాలయ్య. అసలే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసే వర్మ, ఆ చర్చలు పక్కాగా పూర్తి అవ్వకముందే ఎన్టీఆర్ సినిమా గురించి ప్రకటన చేసేసారు. దీంతో బాలయ్య హర్ట్ అయ్యి వేరే దర్శకుడితో సినిమా గురించి చర్చలు జరిపారట. ఈ విషయం తెలియగానే రెచ్చిపోయిన వర్మ ఇప్పుడు ఇదిగో ఇలా “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా అనౌన్స్ చేసాడు.

ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ జోలికి బాలయ్య పోకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. ఒకవేళ ఆ సినిమా తీయాలి అనుకున్నా వర్మ తో ఆ చర్చలు జరిపి వుండాల్సింది కాదేమో. ఒకవేళ జరిపినా ఆయన్ని దర్శకుడిగా కాదనుకుంటే నేరుగా ఆ విషయం చెప్పి ఉంటే బాగుండేదేమో.ఇవన్నీ జరగలేదు కాబట్టే ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టం లక్ష్మి బాంబ్ లా పేలడానికి వర్మ చేతిలో సిద్ధం అవుతోంది. వర్మ సంగతి తెలిసి తెలిసి ఆయన దగ్గర ఎన్టీఆర్ సినిమా టాపిక్ తేకుండా ఉంటే ఇప్పుడు ఈ గోలంతా ఉండేది కాదు. అందుకే వర్మ లా కత్తికి రెండు వైపులా పదును వున్న వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి అడుగు వేయాలి.