Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాల్లో అదిరిపోయే డైలాగ్స్ తో ప్రేక్షకులను మైమరిపించే నందమూరి నటసింహం ఎన్నికల ప్రచారానికి దిగితే ఎలా ఉంటుంది? తన మాటల తూటాలతో సినిమాల్లో విలన్లను చీల్చి చెండాడే బాలయ్య ప్రచారంలో ఎలాంటి మాటల అస్త్రాలు విసురుతారు?
రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలతో బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన బాలయ్య… అదే ప్రాంతంలో ప్రచారానికి వస్తే స్పందన ఎలా ఉంటుంది? నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి బాలయ్య వస్తారన్న విషయం తెలిసినప్పటి నుంచి అందరూ అనుకుంటున్న మాటలివి. ఊహించినట్టుగానే… ప్రచారంలో బాలయ్య తనదైన మార్క్ ప్రదర్శించారు. పదునైన మాటలతో ప్రతిపక్షాన్ని, ఆ పార్టీ అభ్యర్థులను తూర్పారబట్టారు. నంద్యాలలో బాలయ్య రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. తన ప్రచారంలో బాలయ్య వైసీపీపై నిప్పులు చెరిగారు. ఈ ఉప ఎన్నిక న్యాయానికి, అన్యాయానికి మధ్య పోటీ అని బాలకృష్ణ అన్నారు. పార్టీ ఫిరాయించిన శిల్సా బ్రదర్స్ పై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ ఎంతో ప్రేమగా చూసినా… విశ్వాసం లేకుండా వైసీపీ పంచన చేరారని విమర్శించారు.
శిల్పా బ్రదర్స్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటును తూటాగా మార్చి వైసీపీకి బుద్ధి చెప్పాలని నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. బాలకృష్ణ రోడ్ షోకు జనం బారీగా తరలివచ్చారు. రాయలసీమ నేపథ్యంతో ఎన్నో హిట్ సినిమాలు చేసిన బాలకృష్ణకు ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అందుకే చంద్రబాబు బాలకృష్ణను ప్రచారం లోకి దించారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ 2014లోను, అంతకుముందు 2009 ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే అప్పటి ప్రచారానికి, ఇప్పటికీ తేడా ఉంది…ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక పై రాష్ట్రం యావత్తూ దృష్టి పెట్టింది. అధికార. ప్రతిపక్షాలు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. గుక్క తిప్పుకోలేని డైలాగులతో ప్రేక్షకలను సమ్మోహన పరిచే బాలయ్య ఇలాంటి సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఎలా మాట్లాడతారా అని అంతా ఆసక్తిగా గమనించారు. అనుకున్నట్టే బాలయ్య తన ప్రచారంతో టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెంచారు.
మరిన్ని వార్తలు: