Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ‘పైసా వసూల్’ చిత్రం విడుదలకు ముందే జైసింహా చిత్రాన్ని ప్రారంభించాడు. సంక్రాంతి సందర్బంగా జైసింహా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ అయ్యింది. జైసింహా విడుదలకు ముందే తన తండ్రి బయోపిక్ చిత్రాన్ని బాలయ్య షురూ చేశాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ జరిగిన ఈ చిత్రం టీజర్‌ను ఎన్టీఆర్ వర్దంతి రోజు అయిన జనవరి 18న విడుదల చేయాలని భావించారు. అందుకోసం టీజర్‌ను కట్ చేయించడం కూడా జరిగింది. బాలకృష్ణ పూర్తి ఫేస్ కనిపించకుండా, అన్నగారి స్టైల్లో బాలయ్య డైలాగ్ చెప్పడం, షూటింగ్ ప్రారంభం అంటూ టీజర్లో ఉంటుందని ప్రచారం జరిగింది.
రేపు ఎన్టీఆర్ జీవిత చరిత్ర టీజర్ రాబోతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఆశలు అడియాశలు అయ్యాయి. టీజర్ విషయంలో బాలయ్య నిర్ణయం మార్చుకున్నాడు అంటూ సమాచారం అందుతుంది. మామూలుగా జయంతి సందర్బంగా ఏదైనా మంచి కార్యక్రమాలు మొదలు పెడతారు. కాని వర్ధంతి సందర్బంగా సంతాప దినంగా భావిస్తారు.
అలాంటి సంతాప దినం రోజు టీజర్‌ను విడుదల చేయడం అపశకునం అయ్యే అవకాశం ఉందని బాలయ్య భావిస్తున్నాడు. అందుకే వర్ధంతికి టీజర్‌ను విడుదల చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. రిపబ్లిక్ డే సందర్బంగా అదే టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. వేసవి నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, ఇదే సంవత్సరంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను విడుదల చేయాని బాలయ్య పట్టుదలతో ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఎన్నికలున్న నేపథ్యంలో విడుదలకు ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అందుకే 2018లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.